ఆరోగ్య కేంద్రాల్లో నీటి సంక్షోభంతో పెరుగుతున్న మహమ్మారి : డబ్ల్యుహెచ్‌ఒ

0

జెనీవా: ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న నీటి సంక్షోభం కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందేందుకు కారణమౌతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. దీంతో బాధితులతో పాటు సిబ్బంది కూడా అనారోగ్యం బారిన పడుతున్నారని తమ నివేదికలో హెచ్చరించింది. 165 దేశాల నుండి సేకరించిన సమాచారంతో ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల సంరక్షణ సంస్థ (యునిసెఫ్‌)తో కలిసి ఈ నివేదికను రూపొందించినట్లు డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. సరైన నీటి వసతి లేకపోవడం, పారిశుద్ధ్య సౌకర్యాల లేమి, అపరిశుభ్రత వంటి పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపింది. అలాగే వ్యక్తిగత రక్షణ లేకుండా సేవలు చేయడం కూడా ఇటువంటిదేనని పేర్కొంది. సాధారణంగా కరోనా వ్యాప్తి నివారణలో కీలకమైనవి ఇవేనని, కానీ ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు చాలా అవాంతరాలున్నాయని తెలిపింది. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో పేద దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. వైద్య సిబ్బంది ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది మాత్రమే ఉండగా.. కరోనా బారిన పడిన వారిలో 14 శాతంగా నమోదవడం తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేకుండా వారిని విధులు నిర్వర్తించమనడంతో వారి ప్రాణాలకు హాని కలుగుతోందని యునిసెఫ్‌ చీఫ్‌ హెన్రియోట్టా ఫోరే ఆందోళన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.