సూపర్‌ రనౌట్‌.. ఆ మీసానికి పవర్స్‌ ఉన్నాయా!

0

హోబర్ట్‌ : బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో హోబర్ట్‌ హరికేన్స్‌, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ మధ్య ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హరికేనక్స్‌ బౌలర్‌ రిలే మెరెడిత్ ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేసిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 9వ ఓవర్‌ వేసిన మెరెడిత్‌ మూడో బంతిని ర్యాన్ గిబ్సన్‌కు విసిరాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకి పిచ్‌లో ఉండిపోయింది. అప్పటికే నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ ముందుకు రావడంతో ర్యాన్‌ గిబ్సన్‌ కూడా క్రీజు వదిలి పిచ్‌ మధ్యకు వచ్చేశాడు.

అప్పటికే పిచ్‌పై పాదరసంలా కదిలిన మెరెడిత్‌ బంతిని చేత్తో తీసుకోకుండా కేవలం ఫుట్‌వర్క్‌తోనే వికెట్లకు గిరాటేశాడు. గిబ్సన్‌ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను తాకినట్లు రిప్లేలో కనపడడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే రషీద్‌ఖాన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చిన మెరెడిత్‌ అంతకముందు వేసిన ఓవర్లోనూ జొనాథన్‌ వెల్స్‌ను కూడా డకౌట్‌ చేశాడు. ఓవరాల్‌గా మెరెడిత్‌ నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మెరెడిత్‌ గిబ్సన్‌ను ఔట్‌ చేసిన తీరును బిగ్‌బాష్‌ లీగ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం.. మెరెడిత్‌ ఒక్కడే అన్ని పనులు చేస్తున్నాడు.. కచ్చితంగా అతని మీసానికి ఏవో సూపర్‌ పవర్స్‌ ఉన్నాయి’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ జత చేశారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave A Reply

Your email address will not be published.